Indore beggar owns 3 homes | మధ్యప్రదేశ్ ఇందౌర్ నగరంలో రిచెస్ట్ బెగ్గర్ బయటపడ్డాడు. అతడి ఆస్తుల చిట్టా చూసి అధికారులే షాక్ అయ్యారు. జాలి పడి, పుణ్యం వస్తుందని భిక్షం వేసే వారి వద్ద కూడా ఇన్నీ ఆస్తులు ఉండవు. ఇందౌర్ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఆరు వేల మందిని పైగా గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ప్రత్యేక పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సరాఫ్ బజారులో అధికారులు మంగీలాల్ అనే భిక్షాటన చేసే వ్యక్తిని గుర్తించారు. పేరుకే అతడు బిచ్చగాడు. కానీ సంపాదన, స్థిర ఆస్థుల్లో కోట్లకు పడగలెత్తాడు. వికలాంగుడు అయిన మంగీలాల్ చక్రాల వాహనంపై తిరుగుతూ రోజుకు రూ.500-రూ.వెయ్యి సంపాదించుకుంటాడు. అయితే అతడిపై అనుమానంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఇందౌర్ మహా నగరంలో ఒక్క ఇల్లు ఉన్నా వాడు ధనవంతుడు. కానీ ఈ పేద బిచ్చగాడిగా పైకి నటిస్తున్న మంగీలాల్ కు ఏకంగా మూడు ఇల్లులు ఉన్నాయి. మూడంతస్తుల భవనం, ఓ బిల్డింగ్ అలాగే ఒక అపార్ట్మెంట్ ఇతడి సొంతం. విచిత్రం ఏమిటంటే దివ్యంగుల కోటా కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మంగీలాల్ ఓ అపార్ట్మెంట్ ను దక్కించుకున్నాడు. మూడు ఆటో రిక్షాలు, ఓ మారుతీ కారు ఉన్నాయి. వాటిని రోజూ కిరాయికి ఇస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను వడ్డీకి ఇవ్వడం ఇతడి స్పెషాలిటీ. ఇలా రూ.5 లక్షల వరకు వడ్డీలకు ఇచ్చాడు. బంగారు దుకాణాల వ్యాపారులకు సైతం అప్పులిచ్చిన గొప్ప మనసు ఇతడి సొంతం. ఇవేకాకా మరికొన్ని ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇవన్నీ పక్కనపెడితే దివ్యంగుల కోటా కింద అపార్ట్మెంట్ ను పొందడం పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.









