AIMIM MLA’s Wife Najma Sultana Files Nomination for Sarpanch | పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగారు ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సతీమణి. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతుంది. ఏకగ్రీవాలు, పోటాపోటీ నామినేషన్లు, హామీలు, వరాల జల్లు ఇలా గ్రామగ్రామాన ఎన్నికల పండగ కొనసాగుతుంది. ఇదే సమయంలో హైదరాబాద్ లోని కార్వాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంఐఎం నేత కౌసర్ మోహియుద్దీన్ భార్య నజ్మా సుల్తానా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్ గ్రామం మోహియుద్దీన్ స్వగ్రామం.
ఈ క్రమంలో గ్రామంలో ఆయన ఇటీవల ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి నజ్మా ఇక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. దింతో స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే నజ్మా గతంలో హైదరాబాద్ లోని గోల్కొండ, నానక్ నగర్ నుంచి రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచారు. భర్త ఎమ్మెల్యే, స్వయంగా ఆమే రెండు సార్లు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు సర్పంచ్ పదవికి పోటీ పడుతుండడం ఆసక్తిగా మారింది.









