IBomma Case | సినిమాలను పైరసీ చేస్తూ, ఐబొమ్మ అనే వైబ్ సైట్ రన్ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోమవారం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం అయ్యారు.
అనంతరం మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. ఇమ్మడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ, బప్పం వంటి వెబ్‌సైట్ల ద్వారా సినిమాలు పైరసీ చేయడమే కాకుండా, టెలిగ్రామ్ ఛానళ్లలో కూడా అక్రమంగా కంటెంట్‌ను అప్లోడ్ చేసినట్లు తెలిపారు.
సినిమా డౌన్‌లోడ్ చేసేందుకు సైట్ ఓపెన్ చేస్తే మధ్యలో ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు కనిపించే విధంగా సెట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని వివరించారు. అంతేకాకుండా APK ఫైళ్ల రూపంలో ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత వివరాలను సేకరించాడని తెలిపారు.
ఇలాంటి వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. లేకపోతే మీ డేటా మొత్తం వాళ్లు దోచుకుంటారు అని తెలిపారు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి ఇప్పటివరకు 21 వేల సినిమాలు పైరసీ చేశాడని చెప్పారు.
దీని ద్వారా మొత్తం రూ.20 కోట్ల వరకు సంపాదించాడని అందులో రూ.3 కోట్లు ఇప్పటికే సీజ్ చేశామని సజ్జనార్ తెలిపారు. 50 లక్షల మందికి పైగా యూజర్ డేటా రవి వద్ద ఉండటం ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.








