Deputy Cm Pawan Kalyan News | సమాజంలో వైషమ్యాలు సృష్టించేలా, సామాజికవర్గాల మధ్య అంతరాలు పెంచేలా ఈ మధ్య కొన్ని శక్తులు పేట్రేగిపోతున్నాయని పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలాంటి శక్తుల కదలికల పట్ల నిరంతరం నిఘా ఉంచాలని రాష్ట్ర అధికారులకు సూచించారు.
మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కలెక్టర్లు, ఎప్పీల సమావేశంలో ఇతర మంత్రివర్గ సహచరులతో కలసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పలు అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సమష్టిగా కష్టపడాలన్నారు. సామాజిక వర్గాల మధ్య గొడవలుపెట్టేలా పెడుతున్న ఫ్లెక్సీలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, సభలు సమావేశాలపై పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అలాంటి శక్తులను ముందస్తుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా, అభివృద్ధిని నిరోధించే విధంగా ప్రజల్లో వైషమ్యాలు సృష్టించేందుకు, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు.









