Another Indian In Trump Team | నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రానున్న జనవరి 20న ఆయన అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన కేబినెట్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ట్రంప్ టీంలో ఇప్పటికే ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు అవకాశం దక్కింది. తాజాగా మరో భారత సంతతి వ్యక్తి శ్రీరామ్ కృష్ణన్ కు ట్రంప్ తన కార్యవర్గంలో అవకాశం కల్పించారు. వ్యాపారవేత్త, టెకీ, రచయిత అయిన శ్రీరామ్ కృష్ణన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి సీనియర్ పాలసీ అడ్వైజర్ గా నియమితులయ్యారు. వైట్ హౌస్ ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ ఒ శాక్స్ తో కలిసి కృష్ణన్ పనిచేస్తారు. ఈ మేరకు శ్రీరామ్ కృష్ణన్ నియామకాన్ని ప్రకటిస్తూ ట్రంప్ ట్విటర్ లో పోస్టు చేశారు. శ్రీరామ్ కృష్ణన్ చెన్నెకి చెందిన వ్యక్తి. 2005లో అన్నా యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన 2007లో మైక్రోసాప్ట్ లో ప్రోగ్రామ్ మేనేజర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. 2013లో ఫేస్ బుక్ లో చేరి, అనంతరం ట్విటర్, యాహూ, స్పాప్ వంటి సంస్థల్లోనూ పనిచేశారు. ఎలోన్ మస్క్ తో కృష్ణన్ కు మంచి అనుబంధం ఉంది. 2022లో ఎలాన్ మస్క్ ట్విటర్ ను టేకోవర్ చేసిన తరువాత ట్విటర్ ను పునరుద్దరించడానికి మస్క్ తో కలిసి పనిచేశారు.