CM Revanth Comments on KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ (Indiramma Houses App) ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు.
‘ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. కుర్చీ ఖాలీగా ఉండటం తెలంగాణకు మంచిదా..? మీరు వచ్చి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. ప్రశ్నించండి.. సూచనలు ఇవ్వండి’అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు..
‘మాకు భేషజాలు లేవు. వయసులో…అనుభవంలో మీరు పెద్ద వారు.. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. మీ పిల్లలు అల్లరి చిల్లర చేస్తే పెద్దమనిషిగా మీరు వారికి సర్దిచెప్పాలి కదా. వారిని నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా..? మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి.
రామాయణంలో మారీచుడు, సుబాహువులా మా ప్రభుత్వం పై వారిని ఉసి గొల్పడం మంచిదా ఆలోచించండి’? అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
‘గుడిలేని ఊరు ఉందేమో.. కానీ
ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అనీ, వారి కలను నెరవేర్చేందుకు ఆనాడే ఇందిరమ్మ కృషి చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. వ్యవసాయ భూమి పేదల ఆత్మగౌరవం అని గుర్తించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచారు.
పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఘనత ఇందిరా గాంధీది. ‘తెలంగాణలోనే దాదాపు 35 లక్షల ఎకరాల భూమిని ఇందిరమ్మ పంపిణీ చేశారు. భూమిపై పేదలకు హక్కు కలిగించిన గొప్ప నాయకురాలు ఇందిరమ్మ.
రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ… ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని మేం గర్వంగా చెప్పగలం. పేదల సొంతింటి కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ. రూ.4వేలతో మొదలైన ఈ పథకం వైఎస్ హయాం వరకు 1లక్షా 21వేలకు చేరుకుంది ‘ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.