-టీచర్ ఆత్మహత్యాయత్నంపై నారా లోకేశ్ స్పందనదోచి
-దాచుకున్న సొమ్ముతో జగన్ మోసపు రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడని ఫైర్
‘ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పి, మడమ తిప్పిన జగన్ మోసపు రెడ్డి ఊరికొక ప్యాలెస్ కట్టుకుని ఎంజాయ్ చేస్తుంటే.. అబద్ధపు హామీలను నమ్మి మోసపోయిన మీరెందుకు చావాలి మాస్టారు? రండి.. అందరమూ కలిసి పోరాడుదాం. సైకో సర్కారును ఇంటికి సాగనంపుదాం’ అంటూ నారా లోకేశ్ టీచర్లకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా అహోబిలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యాయత్నంపై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. జగన్ మాయమాటలు, హామీలతో మోసపోయిన కర్షక, కార్మిక, ఉద్యోగులంతా ఏకం కావాలంటూ ట్వీట్ చేశారు. వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు.
అరాచక పాలనలో అక్షరాలు నేర్పే గురువులు ఆత్మహత్యాయత్నం చేయడం చాలా దారుణమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని గద్దెనెక్కి 200 వారాలు దాటినా జగన్ అమలు చేయలేదని మండిపడ్డారు. జీపీఎస్ పేరుతో జగన్ మరో వంచనకి తెరలేపాడని అన్నారు. జీతాలు ఏ నెలా సకాలంలో ఇవ్వడంలేదన్నారు. వీటికి తోడు బోధనేతర పనులు, తనిఖీల పేరుతో టీచర్లను సీఎం జగన్ వేధిస్తున్నాడని ఆరోపించారు. సర్కారు అరాచకాలపై ఉద్యోగులు, కర్షక కార్మికులంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి టీడీపీ అండగా నిలబడుతుందని, అంతా కలిసి జగన్ ను ఇంటికి పంపిద్దామని లోకేశ్ చెప్పారు.