Telangana BJP | ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ పొరుగు రాష్ట్రం అయిన కన్నడ గడ్డ మీద హస్తం పార్టీ అధికారం చేపట్టడంతో ఆ ప్రభావం కాస్తో కూస్తో తెలంగాణపై పడింది.
ఉన్నట్టుండి టీ కాంగ్రెస్ లో నూతనోత్తేజం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అంతర్గత కుమ్ములాటలతో ఉన్న పార్టీలో కొంత సఖ్యత కనిపిస్తోంది.
రేవంత్ పై విమర్శలు చేసిన సొంత పార్టీ నేతలు కూడా అంతా కలిసిపోయారు. కొద్ది రోజులుగా పార్టీలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
బీఆరెస్ (BRS Party) నుంచి బహిష్కరణకు గురైన నేతలు, అసంత్రుప్త నాయకులు బీజేపీ వైపు కాకుండా హస్తం వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also: Telangana రాజకీయ సిగలో మరో కొత్త పార్టీ.. ప్రజానౌక తీరం చేరుతుందా!
కర్ణాటక ఎన్నికల కంటే ముందు వరకు తెలంగాణ లో ఎక్కడ చూసినా బీజేపీ వర్సెస్ బీఆరెస్ గా ఉన్న వాతావరణం ఫలితాల తర్వాత మారింది.
దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పైన బీజేపీ చేసిన ప్రచారం. బీజేపీ నాయకులు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లో లేదు.. గల్లీ లో లేదు.. అని తరచుగా ఎద్దేవా చేసేవారు.
కానీ కర్ణాటక ఫలితాల ద్వారా ఆ ప్రచారం అటకెక్కింది. రోజురోజుకీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారుతున్నట్లు కనిపిస్తోంది.
పైగా మొన్నటి వరకు బీజేపీపై ఒంటికాలితో లేచి విరుచుకుపడే సీఎం కేసీఆర్, మంత్రులు సహా విమర్శల్లో ఆ పార్టీ పేరే పెద్దగా ఎత్తడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఢిల్లీ పర్యటన మరింత ఆసక్తిని రేపుతోంది. పేరుకు రాష్ట్ర సమస్యల గురించి వివరించడానికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. రాజకీయ అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి బీజేపీకి ఇప్పటికిప్పుడు తెలంగాణలో అధికారం చేపట్టడం కంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం.
అందుకోసం కాంగ్రెస్ పుంజుకుంటున్న తరుణంలో అవసరమైతే బీఆరెస్ తో చేతులు కలిపే అవకాశాలను కొట్టిపారేయలేం. అందుకే కేటీఆర్ డిల్లీ పర్యటనకు ఇంత ప్రాధాన్యం నెలకొంది.
Also Read: అమిత్ షా-కేటీఆర్ భేటీ.. బీజేపీ-బీఆరెస్ బంధానికి దారితీస్తుందా!
ఈటల, కోమటిరెడ్డిలకు పిలుపు..
బీఆరెస్ తో విబేధించి ఈటల (Eatala Rajender), కాంగ్రెస్ కి రాజనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఉప ఎన్నికలో ఈటల గెలిస్తే.. కోమటిరెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే తాజాగా వీరిద్దరిపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
వీరిద్దరూ బీజేపీలో ఇమడలేకపోతున్నారనీ, త్వరలో హస్తం గూటికి చేరుతారని ప్రచారం ఊపందుకుంది.
ఈ క్రమంలో తాజాగా వీరిద్దరికీ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇద్దరూ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పెద్దల ఆదేశాలమేరకు హస్తినకు బయలు దేరారు.
రాష్ట్రంలో పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలకు స్వస్తి పలికి, ఈటలను, కోమటిరెడ్డిని బుజ్జగించడానికే పిలిచారని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో పార్టీ నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరూ పార్టీ మారకుండా ఏవైనా కీలక బాధ్యతలు అప్పజెపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ఓవైపు బీఆరెస్-బీజేపీ బంధంపై వార్తలు రావడం, కేటీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడే కిషన్ రెడ్డి, ఈటల, కోమటిరెడ్డిలకు పిలుపురావడం పలు సందేహాలకు తావిస్తోంది.
ఏమో ఏ భేటి వెనుక ఏ చర్చలు ఉన్నాయో.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కదా!