Thursday 21st November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > హైదరాబాద్-విజయవాడ రూట్లో 50 ఎలక్ట్రిక్ బస్సులు.. ‘ఈ ‌- గరుడ’ విశేషాలివే!

హైదరాబాద్-విజయవాడ రూట్లో 50 ఎలక్ట్రిక్ బస్సులు.. ‘ఈ ‌- గరుడ’ విశేషాలివే!

tsrtc e Garuda bus

TSRTC e-Garuda Bus | ఇటీవల కాలంలో సరికొత్త ఆఫర్లు, అధునాతన సౌకర్యాలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మరో కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది.

ప్రయాణికుల సౌకర్యంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను (Electric AC Bus) అందుబాటులోకి తెచ్చింది.

ఈ క్రమంలోనే హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తుంది.

అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో రూపొందించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు ‘ఈ-గరుడ’ (e-Garuda) అని సంస్థ నామకరణం చేసింది.

హైదరాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ-గరుడ బస్సుల ప్రారంభోత్సవం లాంఛనంగా జరగనుంది.

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ “ఈ-గరుడ” బస్సులను ప్రారంభించనున్నారు.

హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రతి 20 నిమిషాలకు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు సోమవారం తెలిపారు.

రానున్న రెండేళ్లలో 1860 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇందులో హైదరాబాద్ నగరంలో 1300 బస్సులు, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడపనున్నట్లు కార్పొరేషన్ అధికారులు వివరించారు.

ఇవే కాకుండా రాబోయే నెలల్లో హైదరాబాద్‌లో మొత్తం 10 డబుల్ డెక్కర్ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. 

ఈ – గరుడ బస్ విశేషాలు ఇవీ..!

  • ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ – గరుడ బస్సులో అన్ని సౌకర్యాలు కల్పించారు.
  • బస్సు పొడవు 12 మీటర్లు ఉంటుంది. మొత్తం 41 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, రీడింగ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు.
  • ప్రయాణీకుల భద్రత కోసం, వాహన ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్‌ను ఏర్పాటు చేశారు. వాటిని టీఎస్‌ఆర్‌టీసీ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు.
  • ఒక్కో బస్సులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది.
  • బస్సులోని ప్రయాణికులను లెక్కించేందుకు ఆటోమేటిక్ ప్యాసింజర్ కౌంటర్ (ఏపీసీ) కెమెరాను ఏర్పాటు చేశారు.
  • బస్సు రివర్స్ అయ్యేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఏర్పాటు చేశారు.
  • బస్సు ముందు, వెనుక భాగంలో ఎల్‌ఈడీ బోర్డులు ఉంటాయి. గమ్యస్థానాల వివరాలు అందులో కనిపిస్తాయి.
  • అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నిరోధించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ (FDSS)ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసేందుకు బస్సుల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది.
  • ఈ – గరుడ బస్సులు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions