4 Indians who rescued Pawan Kalyan’s son from fire honoured by Singapore govt. | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవలే సింగపూర్ దేశంలో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకుని గాయపడిన విషయం తెల్సిందే.
అయితే అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అక్కడే ఉన్న నలుగురు భారత కార్మికులు మంటల్లో చిక్కుకున్న పిల్లలను కాపాడారు. తాజగా సింగపూర్ ప్రభుత్వం కార్మికులను సత్కరించింది. ఏప్రిల్ 8న సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్డులో టొమాటో కుకింగ్ స్కూల్ ఉన్న మూడు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఇదే సమయంలో ఇందర్‌జిత్ సింగ్, సుబ్రమణియన్, నాగరాజన్, శివసామి విజయరాజ్ అనే కార్మికులు సమీపంలోని నిర్మాణ స్థలంలో పనిచేస్తున్నారు. పిల్లల కేకలు, దట్టమైన పొగను గమనించి వారు వెంటనే స్పందించారు. తమ పనిస్థలం నుంచి స్కాఫోల్డ్, నిచ్చెనలను తీసుకొచ్చి, భవనంలోని మూడో అంతస్తు కిటికీ వద్ద చిక్కుకున్న పిల్లలను రక్షించారు.
సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ రాకముందే, కేవలం 10 నిమిషాల్లో ఆరుగురు పిల్లలను సురక్షితంగా కాపాడారు. సింగపూర్ హోమ్ అఫైర్స్ మంత్రి కె. షణ్ముగం కార్మికులను అభినందించారు. ఈ నేపథ్యంలో వారి సాహసానికి ‘సివిల్ డిఫెన్స్ ఫోర్స్ బ్రేవరీ అవార్డ్’ ప్రదానం చేశారు.
పవన్ కళ్యాణ్ తన కుమారుడిని కాపాడిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. “వారు నా కుటుంబానికి మాత్రమే కాదు, అందరికీ హీరోలు. వారి ధైర్యం మరువలేనిది,” అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్‌తో పాటు 15 మంది పిల్లలు, ఆరుగురు పెద్దలు గాయపడగా, ఒక 10 ఏళ్ల ఆస్ట్రేలియన్ బాలిక ఆసుపత్రిలో మరణించింది.