భారత్ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ కీలక ప్రకటన చేశారు. తమ ఏడేళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సైనా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘జీవితం కొన్నిసార్లు వేర్వేరు మార్గంలో తీసుకెళ్తుంది’ అని ఆ పోస్ట్ కు క్యాప్షన్ పెట్టారు. సుదీర్ఘ చర్చలు, ఎన్నో ఆలోచనల తర్వాత కశ్యప్ పారుపల్లి, తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు సైనా. తాము ప్రశాంతత, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకున్నామని తెలిపారు. తమ పరిస్థితిని అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. తమ గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కశ్యప్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ సమయంలో మొదలైన సైనా-కశ్యప్ స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో 2018లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.





