దేవ్నా జనార్ధన్.. దేశ వ్యాప్తంగా ఒక వారం రోజుల నుంచి డిజిటల్ మీడియాలో.. సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. ఆ బాలిక వయసు పదేళ్లే. చేసింది చిన్న సాయమే కానీ.. ఆ వయసుకు.. ఆ అమ్మాయికి ఉన్న పరిణితికి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న ఆ బాలిక.. తన కెరీర్‌కు నష్టం వస్తుంది అని తెలిసినా గొప్ప నిర్ణయం తీసుకుంది.. ఏంటా నిర్ణయం.. ఏమిటా సాయం.. తెలుసుకుందాం..
సాధారణంగా ఆడవాళ్లు తమ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యం గురించి అందరికే తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు, అమ్మాయిలకు.. బాలికలకు కూడా వాళ్ల జుట్టంటే ప్రాణం.
పొడుగాటి కురులతో తమ అందం మరింత రెట్టింపు అవుతుందనీ, అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందనీ భావిస్తారు. వాళ్ల కేశాలను కాపాడుకోవడానికి పడే ప్రయాస అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్‌లో అంటే సినిమా, టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు తమ అందం గురించి.. స్క్రీన్‌పై అప్పీయరెన్స్ గురించి మామూలు మహిళల కంటే ఇంకొంచెం ఎక్కువగానే శ్రద్ధ వహిస్తారు. అది వారికి అవసరం కూడా.
కానీ, క్యాన్సర్ పేషంట్ల పరిస్థితి మాత్రం చాలా భిన్నం. అప్పటికే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నవారికి జుట్టు కూడా ఓ ప్రధాన సమస్య. వ్యాధితో పోరాడి బతకడానికి వారికెంతో ఆత్మ విశ్వాసం కావాలి. తమను తాము చూసుకుంటే ఎలాగైనా బతకాలి అనే కసి వారిలో రావాలి.
కానీ, కాన్సర్‌తో బాధపడే వాళ్లు తరచూ చిన్న చిన్న ఆపరేషన్‌ల వల్లనో.. లేదా చికిత్సలో వాడే మందుల వల్లనో జుట్టు కోల్పోతుంటారు. జుట్టు మొత్తం కోల్పోవడంతో బోడి గుండుతో ఉండాల్సి వస్తుంది. దీంతో బయట పెద్దగా తిరగలేరు. అలాంటి వారి కోసమే.. కొంతమంది సామాజిక కార్యకర్తలు అప్పుడప్పుడు తమ కేశాలు దానం చేసి, గొప్ప మనసు చాటుకుంటారు.
ఈ విషయం గురించి తెలుసుకున్న చిన్నారి దేవ్నా జనార్ధన్ తన వయసుకు మించిన పరిణితితో ఆలోచించింది. క్యాన్సర్ రోగుల కోసం తన వంతు కూడా ఏదైనా చేయాలని భావించి గొప్ప నిర్ణయం తీసుకుంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టును వారి కోసం దానం చేసింది.
గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన పదేళ్ల చిన్నారి దేవ్నా జనార్దన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇప్పుడిప్పుడే మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
అయితే.. ఇటీవల దేవ్నా సోషల్ మీడియాలో బాల్డ్ బ్యూటీ వరల్డ్ అనే వెబ్ పేజీని చూసింది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్లో భాగంగా జుట్టు కోల్పోయిన వారికి ఈ సంస్థ తరఫున కొంతమంది మహిళలను తమ కురులను దానం చేస్తుంటారు.
ఈ సంస్థ గురించి తెలుసుకున్న దేవ్నా కూడా తన చిన్నప్పటి నుంచి ఇష్టంగా పెంచుకుంటున్న 32 అంగుళాల పొడవాటి జుట్టును దానం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తన కెరీర్‌కు ఇబ్బంది ఎదురవుతుందని తెలిసినా సరే.. జుట్టు కత్తిరించుకోవాలని భావించింది.
తన కురులు ద్వారా ఇద్దరు క్యాన్సర్ రోగులు ఆనందం పొందుతారంటే.. వారి కోసం నా జుట్టును సంతోషంగా ఇచ్చేయలనుకన్నా అని చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలనుకుంటున్నానని తన కోరికను వెల్లడించింది.
చాలామందికి ఈ సాయం చాలా చిన్నదనిపించొచ్చు గాక.. కానీ, ఆ బాలిక వయసుకు.. అందులోనూ గ్లామర్ ఫీల్డ్ ఎదుగుతోంది కాబట్టి తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది.
పదేళ్ల వయసులోనే ఈ చిన్నారి చూపిన ఈ ఔదార్యం, ఆ మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తూ.. దేవ్నా.. నువ్వు అనుకున్నది సాధించాలంటూ కామెంట్లతో దీవిస్తున్నారు.
నలుగురికి ఉపయోగపడే మంచి పని చేయడానికి వయసుతో సంబంధం లేదు.. మంచి మనసు.. ఉన్నతమైన ఆలోచన ఉంటే చాలని నిరూపించింది దేవ్నా.. ఆయుష్మాన్ భవ.

👌👌👌