CM Revanth Reddy Meeting JP Nadda Discussion On Urea Supply | తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్ – జూన్ మధ్య రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం, వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు.
జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్పత్తయిన యూరియా 63 వేల మెట్రిక్ టన్నులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా 97 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే చేశారని ఈ నేపథ్యంలో మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.
అలాగే, తెలంగాణకు దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్‌లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య కూడా పెంచాలని పేర్కొన్నారు.