PM Narendra Modi Breaks Indira Gandhi Record | ప్రధానమంత్రి నరేంద్రమోదీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు.
2025 జూలై 25 నాటికి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగిన రికార్డును మోదీ బద్దలు కొట్టారు.
దీంతో, భారత చరిత్రలో రెండవ అత్యధిక కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మోదీ నిలిచారు. అయితే, అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగిన రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉంది. ఆయన 1947-1964 వరకు 16 సంవత్సరాలు 286 రోజులు పాటు ప్రధానిగా దేశానికి సేవలందించారు.
మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని విజయపథంలో నడిపించారు. వరసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన ఘనత నెహ్రూ తర్వాత మోదీకే దక్కింది.
అలాగే, స్వాతంత్య్రం తర్వాత జన్మించిన మొదటి ప్రధానిగా, అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర నాయకుడిగా, హిందీ మాట్లాడని రాష్ట్రం నుంచి ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా మోదీ పలు రికార్డులు సృష్టించారు.
2001-2014 మధ్య గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ, 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి వరసగా ఆరు ఎన్నికల్లో విజయం సాధించిన ఏకైక నాయకుడిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు.









