Union Minister Giriraj Singh says Bengal is next for BJP | బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో ఎన్డీయే ఘన విజయం సాధించిందని ఇప్పుడు తమ లక్ష్యం పశ్చిమ బెంగాల్ అని చెప్పారు. బీహార్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 243 స్థానాలు ఉన్న బీహార్ లో ఎన్డీయే పక్షం ఏకంగా 200 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోవైపు మహా ఘడ్భంధన్ మాత్రం కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
ఈ క్రమంలో గిరిరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈయన బీహార్ లోని బెగుసరాయ్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్ ప్రజలు అభివృద్ధి, శాంతి, న్యాయం కు పట్టం కట్టారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఆర్జేడీ నేతృత్వంలోని గందరగోళం, అవినీతి, దోపిడీ పాలన వద్దని కోరుకున్నారని విమర్శించారు. లాలూ జంగల్ రాజ్ గురించి ఇప్పటి యువకులకు తెలీకపోవొచ్చు కానీ గతంలో జంగల్ రాజ్ పాలనను అనుభవించిన ప్రజలకు బాగా తెలుసన్నారు.
ఈ క్రమంలోనే ఆర్జేడి నేతృత్వంలోని మహా ఘడ్భంధన్ ను తిరస్కరించి ప్రధాని మోదీ, నితీష్ కుమార్ లను ఎంచుకున్నారని పేర్కొన్నారు. బీహార్ లో ఎన్డీయే ఘన విజయం ఖాయం అని అన్నారు. అనంతరం బీహార్ గెలుపు ఖాయం, ఇప్పుడు బెంగాల్ మా లక్ష్యం అని గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. ఇకపోతే వచ్చే ఏడాదిలో వెస్ట్ బెంగాల్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే.









