Minister Komatireddy Venkat Reddy | తెలుగు రాష్ట్రాల్లోని అతి పెద్ద పండగల్లో ఒకటైన సంక్రాంతి (Sankranthi) పండుగ కు మరికొద్ది రోజులే ఉంది.
ఈ పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్తారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరుగుతుంది.
ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 8వ తేదీ నుంచే హైవేలపై వాహన రద్దీ గణనీయంగా పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు సురక్షితంగా, సజావుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో హైవేలపై మరమ్మతులు లేదా ఇతర కారణాలతో లేన్లను మూసివేసే పనులను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.
వాహనాల రాకపోకలకు అన్ని లేన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ జామ్లను నివారించేందుకు కీలకమైన ప్రాంతాల్లో, జంక్షన్ల వద్ద అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని మంత్రి ఆదేశించారు.







