TG Police Alert On Cyber Frauds | రోజురోజుకి పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల తెలంగాణ పోలీసులు నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రజలకు తమ వంతుగా అవగాహన కల్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా పార్ట్ టైం జాబ్ లు, ఫ్రీ గిఫ్ట్ ల పేరుతో వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
“ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు అనేది అబద్దం. పార్ట్ టైమ్ జాబ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి. సులభంగా వచ్చే డబ్బు కోసం ఆశపడి మీ ఖాతాలు ఖాళీ చేసుకోవద్దు. పార్ట్ టైమ్ జాబ్స్ వెనుకున్న సైబర్ మోసాలను గ్రహించండి” అని పేర్కొన్నారు.
అంతే కాకుండా ఉచితంగా వచ్చే గిఫ్ట్ కోసం ఆశపడొద్దని సూచించారు. విరాళాలు ఇస్తాం, గిఫ్ట్ పంపిస్తామంటూ నమ్మించి మోసగిస్తారు. కస్టమ్స్ డ్యూటీ, ట్యాక్స్ అంటూ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు జాగ్రత్త. ఫ్రీగా వస్తున్నాయంటే మోసం ఉందని గుర్తుంచుకోండి” అని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు.
మీరు చేసే చిన్న క్లిక్ వల్ల మీరు జీవితాంతం దాచుకున్న డబ్బు కోల్పోయే అవకాశం ఉంటుందనీ, సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్ల ప్రకటనలు చూసి ఆశపడి అస్సలు లింక్ క్లిక్ చేయొద్దని వివరించారు. సైబర్ మోసాలపై అవగాహనే మీకు రక్ష అని పేర్కొన్నారు.









