Team India Visits Dhoni’s Home For Dinner | సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డే మ్యాచుల సిరీస్ ఆదివారం నుండి ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా టీం ఇండియా-సఫారీ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ క్రమంలో ప్లేయర్లు ఇప్పటికే రాంచీ చేరుకుని ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. రాంచీ అనగానే టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గుర్తుకువస్తారు. ఈ క్రమంలో రాంచీలోనే ఉన్న టీం ఇండియా ప్లేయర్లకు ధోని గురువారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్ మరియు ఇతరులు రాంచీలోని ధోని నివాసానికి చేరుకుని డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు.
ఇలా ప్లేయర్ల రీ యూనియన్ జరిగింది. ఈ నేపథ్యంలో ధోని నివాసం ముందు భారీగా అభిమానులు చేరుకున్నారు. డిన్నర్ తర్వాత ధోని స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి విరాట్ కోహ్లీని హోటల్ వద్ద డ్రాప్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ధోని, కోహ్లీ మధ్య మంచి అనుంబంధం ఉన్న విషయం తెల్సిందే. మరోవైపు ఆదివారం జరగబోయే మ్యాచ్ కు ధోని వెళ్తారా అనే చర్చ నడుస్తోంది. ఐపీఎల్ తర్వాత ఇప్పటివరకు ధోని స్టేడియంలో కనిపించలేదు. ఇకపోతే రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో టీం ఇండియా వైట్ వాష్ అయిన నేపథ్యంలో వన్డే సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శుభమన్ గిల్ గాయం కారణంగా దూరం అవ్వడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.









