SS Rajamouli About Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’ మూవీలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారని దర్శక ధీరుడు రాజమౌళి స్పెషల్ ప్రకటన చేశారు. ఆయన రాముడి పాత్రలో నవరసాలు పండించారని పేర్కొన్నారు. శ్రీరాముడి పాత్రలో మహేశ్ బాబు ఉన్న ఫోటోను తన ఫోన్ వాల్ పేపర్ ల పెట్టుకున్నట్లు, కానీ ఎవరైనా చూసి దాన్ని లీక్ చేస్తారనే భయంతో ఆ తర్వాత తొలగించినట్లు దర్శకుడు తెలిపారు.
శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వారణాసి’ మూవీకి సంబంధించి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా మూవీ టైటిల్, స్పెషల్ వీడియోను విడుదల చేశారు. పరమేశ్వరుడి వాహనం అయిన నందిపై మహేశ్ బాబు త్రిశూలం పట్టుకుని కనిపించిన వీడియో అభిమానులకు పూనకలు తెప్పించింది. ఈ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి కీలక విషయాలు చెప్పారు. వారణాసి మూవీ అసలు సిసలైన ఐ మాక్స్ ఫార్మాట్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఈవెంట్ కంటే ముందు భారీ స్క్రీన్ పై స్పెషల్ వీడియో ను టెస్టు చేయగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో లీక్ చేశారని రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీరాముడి పాత్ర కోసం మహేశ్ బాబుకు గెటప్ వేసి ఫోటో షూట్ చేసినట్లు, అలాగే ఈ పాత్రకు సంబంధించిన సీన్లను 60 రోజుల పాటు తెరకెక్కించినట్లు వివరించారు. శ్రీరాముడి పాత్రలో మహేశ్ అద్భుతంగా నటించారని కొనియాడారు. మహేశ్ షూటింగ్ కు వచ్చే సమయంలో ఎంతో క్రమశిక్షణగా ఉంటారని, ఫోన్ ను కారులోనే వదిలేసి వస్తారని రాజమౌళి చెప్పారు. షూటింగ్ జరిగేంత సేపు మహేశ్ ఫోన్ వైపు అసలు చూడరని తాను కూడా ఇలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.









