Revanth Reddy Reviews Medaram and Basara Temples Development Works | తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన మేడారం, బాసర ఆలయాలపై సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
రెండు ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. జంపన్న వాగులో నీరు నిలిచేలా చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి సమీక్ష చేసిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.
దేవాలయాల అభివృద్ధిలో స్థానిక సెంటిమెంట్లు, స్థానిక పెద్దలు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.









