Rajastan District Collector | రాజస్థాన్ లో ఓ జిల్లా కలెక్టర్ వార్తల్లో నిలిచారు. తన టార్గెట్ రీచ్ అయ్యే వరకు తాను జీతం తీసుకోబోనని ప్రతినబూనారు. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో తెలుసా. ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల లబ్ధిదారుల ధృవీకరణ పూర్తి చేయడం.
జనవరి 28వ తేదీలోగా ఆ టార్గెట్ పూర్తి చేయకపోతే జనవరి నెల జీతం తీసుకోనని రాజసమంద్ జిల్లా కలెక్టర్ (Rajsamand Collector) అరుణ్ కుమార్ హసిజా (Arun Kumar Hasija) స్పష్టం చేశారు. గడువు లోగా నిరుపేదలకు వారి హక్కులు అందకపోతే జీతం ప్రాసెస్ చేయవద్దని అకౌంటెంట్‌కు సూచించినట్లు తెలిపారు.
జిల్లా పరిపాలన వివరాల ప్రకారం, వివిధ ఎస్‌డిఎంల పరిధిలో 23,000 పెన్షన్ కేసులు, 3,200 పాలన్‌హార్ పథకం దరఖాస్తులు, 700 ఆహార భద్రతా పథకం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో వృద్ధాప్య, వితంతు పెన్షన్ కేసులు అత్యధికంగా ఉండగా, అనాథ మరియు నిరుపేద పిల్లలకు ఆర్థిక సహాయం అందించే పాలన్‌హార్ పథకంలో కూడా పెండింగ్ లో ఉంది.
కలెక్టర్ నిర్ణయంతో ఎస్‌డిఎంలపై ఒత్తిడి పెరిగింది. దీంతో 100 శాతం ధృవీకరణ పూర్తికాకపోతే తామూ జీతం తీసుకోమని వారు నిర్ణయించారు. కలెక్టర్ నిర్దేశించిన గడువులోగా పెండింగ్ కేసులు పూర్తి చేస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ కుమార్ హసిజా, రాష్ట్ర పౌర సేవల నుంచి పదోన్నతి పొందారు. కలెక్టర్‌గా ఇది ఆయనకు తొలి పోస్టింగ్ కావడం విశేషం.









