Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
ఈ మేరకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేనాని, ఈ సందర్భంగా మాట్లాడుతూ..టీడీపీ రెండు సీట్లు ప్రకటించింది కాబట్టి, జనసేన కూడా రాజోలు, రాజా నగరం స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే తనపై కూడా ఒత్తిడి ఉందని ఇందులో భాగంగా రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
పొత్తులో ఉండగా ఏకపక్షంగా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని టీడీపీని నిలదీశారు. లోకేశ్ సీఎం పదవిపై మాట్లాడినా గాని, రాష్ట్ర ప్రజల కోసం తాను మౌనంగా ఉన్నట్లు తెలిపారు. పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదని, రెండు పార్టీలు కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చన్నారు. ఒక మాట అటున్నా, ఇటు ఉన్నా టీడీపీ జనసేన కలిసే వెళ్తాయన్నారు పవన్ కళ్యాణ్.









