Nara Lokesh News Latest | దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వేసిన శిలాఫలకం వద్ద సెల్ఫీ దిగారు మంత్రి నారా లోకేశ్. మంగళగిరి పట్టణం శివాలయం వద్ద రూ.1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని గురువారం ప్రారంభించారు లోకేశ్. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. నేడు ఆధునీకరించిన లైబ్రరీని తాను ప్రారంభించినట్లు సంతోషం వ్యక్తం చేశారు.
తాత ఎన్టీఆర్ వేసిన శిలాఫలకం వద్ద ఈ సందర్భంగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకంటే ముందు మంగళగిరి ఆర్టీసీ డిపో వద్ద పావురాల కాలనీలో నూతనంగా నిర్మించిన నూర్ మస్జీద్ ను లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మతం ఏదైనా మానవత్వం మర్చిపోకూడదని మనతో ఉన్నవారిని పైకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.









