Nara Lokesh | ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్శ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, ఆ ఫోటోలలో పూజ గదిలో ఒక చిన్న బొమ్మ కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకున్నారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ ఒక ఎమోషనల్ క్లారిటీ ఇచ్చారు.
దేవాన్శ్ చిన్ననాటి జ్ఞాపకం
పూజ గదిలో ఉన్నది సాదాసీదా బొమ్మ కాదని, అది పరమశివుడి ప్రతిరూపం అని లోకేష్ పేర్కొన్నారు. దేవాన్శ్ కు 4 ఏళ్ల వయసున్నప్పుడు తన చిన్ని చేతులతో ఆ శివలింగాన్ని తయారు చేశాడని ఆయన వెల్లడించారు.
తన కుమారుడు ఒక చిన్న శివ భక్తుడిగా ఎదుగుతుండడం సంతోషంగా ఉందని, వాడు భక్తితో చేసిన ఆ లింగాన్ని జ్ఞాపకంగా పూజ గదిలో ఉంచినట్లు తెలిపారు.
భక్తికి వివరణ అవసరం లేదు
“కొందరు విశ్వాసాన్ని అర్థం చేసుకుంటారు, మరికొందరు చేసుకోరు. కానీ భక్తికి ఎలాంటి వివరణ అవసరం లేదు” అంటూ లోకేష్ పరోక్షంగా విమర్శకులకు సమాధానం ఇచ్చారు.
దేవాన్శ్ లోని సృజనాత్మకతను, భక్తిని గౌరవిస్తూ ఆ శివలింగాన్ని తమ పూజ గదిలో అత్యంత భక్తితో కొలుస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ వివరణతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు తెరపడినట్లయింది.






