Minister Vakiti Srihari about his Cricket Career | తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి. దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే తన కల అర్ధాంతరంగా ముగిసిందని వివరించారు. మహారాష్ట్ర తరఫున రంజీ మ్యాచులు ఆడినట్లు అయితే ఓ రోడ్డు ప్రమాదం తనకు శాశ్వత బాధను మిగిల్చిందన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడుతూ తన క్రికెట్ ప్రయాణం గురించి చెప్పారు.
1992 నుంచి 1994 మధ్య ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ ఆడినట్లు అజారుద్దీన్ వంటి దిగ్గజ ప్లేయర్లు తన సీనియర్లు అని తెలిపారు. అయితే ఉమ్మడి ఏపీలో పోటీ ఎక్కువగా ఉండడంతో మహారాష్ట్ర తరఫున మ్యాచులు ఆడేందుకు వెళ్లినట్లు అనంతరం మహారాష్ట్ర తరఫున రంజీ మ్యాచులు ఆడినట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో సునిల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్ వంటి ఆటగాళ్లు తన సీనియర్లు అని వివరించారు. ఇదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చిందన్నారు. కానీ 1997-1998 ప్రాంతంలో బైక్ పై స్వగ్రామానికి వస్తున్న సమయంలో పూణే వద్ద తనకు జరిగిన ప్రమాదం జీవిత లక్ష్యం అయిన క్రికెట్ ను తన చేతుల నుండి తీసుకెళ్లిపోయిందని భావోద్వేగానికి లోనయ్యారు. రోడ్డు ప్రమాదం మూలంగా వెన్నుపూసకు తీవ్ర గాయం అయి తిరిగి మైదానంలోకి దిగే శక్తిని కోల్పోయినట్లు చెప్పారు. మైదానంలో ఆడలేకపోయిన క్రికెట్ తన గుండెల్లో బ్రతికే ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.









