- ‘అరైవ్ – అలైవ్’ పోస్టర్‌ను విడుదల
Ponnam Prabhakar Arrive Alive campaign | రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా రవాణా శాఖ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు భద్రత కోసం ఏప్రిల్ 13 నుండి 18వ తేదీ వరకు పోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోపు (గోల్డెన్ అవర్) బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి ‘రహవీర్ అవార్డు’ అందజేస్తామని ప్రకటించారు.
ఆర్టీసీలో 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని, ఒక్క ప్రమాదం కూడా చేయని నిష్ణాతులైన డ్రైవర్లను ప్రభుత్వం తరపున సన్మానించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తూనే కొన్ని హెచ్చరికలు చేశారు. రెండు ప్రధాన సమస్యలు మినహా మిగతా అన్ని అంశాలపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఎవరో ప్రేరేపిస్తే సమ్మెలకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు. ఇప్పటికే పెండింగ్ డీఏలను (DA) విడుదల చేశామని, త్వరలోనే పీఆర్సీ (PRC)పై కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ ప్రస్తుతం కమిటీ పరిశీలనలో ఉందని గుర్తు చేశారు.






