Merger of 27 municipalities into GHMC approved by Telangana Cabinet | తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరింత గ్రేటర్ గా మారనుంది. ఓఆర్ఆర్ కు లోపల, అనుకుని ఉన్న 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో విలీనం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దింతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతుంది.
తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించింది. మేడ్చెల్- మల్కాజిగిరి జిల్లాకు చెందిన 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, అలాగే రంగారెడ్డి జిల్లాలోని 3 కార్పొరేషన్లు, 8 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలోని 3 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి.









