Man Escapes From Kidnapers | ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో టెక్నాలజీ (Technology) ఎలా సాయం చేస్తుందో మరోసారి రుజువైంది. ఓ స్మార్ట్ వాచ్ (Smart Watch) సాయంతో కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డాడు ఓ యువకుడు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఒక కిడ్నాప్ ఘటనలో యువకుడు కిడ్నాపర్లలో ఒకరి స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. సౌరభ్ శర్మ అనే హోటల్ మేనేజర్ హేమంత్ శర్మ, సచిన్ త్యాగి అనే ఇద్దరి వద్ద అప్పు తీసుకున్నాడు.
అప్పు మొత్తానికి మించిన డబ్బు తిరిగి చెల్లించినప్పటికీ, వారు చక్రవడ్డీతో మరింత మొత్తం డిమాండ్ చేశారు. సౌరభ్ నిరాకరించడంతో అతడిని బలవంతంగా ఒక ఇంటికి తీసుకెళ్లి గదిలో నిర్బంధించారు.
అయితే కిడ్నాపర్లలో ఒకరు అక్కడే వదిలివెళ్లిన స్మార్ట్ వాచ్‌ను సౌరభ్ గమనించి ఆ వాచ్ సాయంతో తన స్నేహితుడికి కాల్ చేసి లొకేషన్‌ను కూడా పంపించాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. లొకేషన్ ఆధారంగా పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.





