KTR News Latest | తన అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని బీఆరెస్ పార్టీపై, మూసీని వ్యతిరేకిస్తున్న ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడుపులో కొండంత విషం పెట్టుకున్నారని ధ్వజమెత్తారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాలలో భాగంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదన్నారు. కలుషితమైన మూసీ కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచే ఎక్కువ కంపు కొడుతోందని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి ముందే రూ.లక్షన్నర కోట్లు వ్యయం ఎలా చెప్పారని పేర్కొన్నారు. డీపీఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్‌డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో మూసీని కలుషితం చేసిందే 60 సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే అని ఆరోపించారు.









