- ఫిరాయింపులకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఖండించిన కేంద్ర మంత్రి
- స్పీకర్ తీరుపై నిప్పులు
Kishan Reddy on Telangana Speaker | తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం అడుగడుగునా అవమానానికి గురవుతోందని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో అసెంబ్లీ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఫిరాయింపుదారులకు స్పీకర్ ‘క్లీన్ చిట్’ ఇవ్వడం తెలంగాణ ప్రజల తీర్పును వెన్నుపోటు పొడవడమేనని విమర్శించారు.
బిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్.. మార్పు ఎక్కడ?
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక విధానాలనే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. “దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నాయకులు బహిరంగంగా పార్టీలు మారినప్పటికీ, వారికి క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యకరం. ఈ రెండు పార్టీల ఆలోచనా శైలిలో, వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు” అని ఆయన పేర్కొన్నారు.
సాక్ష్యాలు కళ్లకు కనిపిస్తున్నా.. స్పీకర్‌కు ఎందుకు కనిపించడం లేదు?
బిఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి సమక్షంలో కండువా మార్చుకుని, ఏకంగా కాంగ్రెస్ బి-ఫామ్ మీద ఎంపీగా తనపైనే పోటీ చేసిన సాక్ష్యాలు ప్రపంచమంతటికీ కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. “సామాన్యులకు కనిపిస్తున్న ఈ సాక్ష్యాలు గౌరవ స్పీకర్ గారికి ఎందుకు కనిపించడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఫిరాయింపులకు చట్టబద్ధత కల్పించడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ‘చీకటి అధ్యాయం’ అని అభివర్ణించారు.
రక్షకులే భక్షకులుగా మారారు..
రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీ చేతిలో బందీలుగా మార్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజా తీర్పును అంగట్లో సరకుగా మార్చారని, దానికి స్పీకర్ వత్తాసు పలకడం దురదృష్టకరమని అన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్‌లోకి, ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నాయని విమర్శించారు.
ప్రజల ఆగ్రహాన్ని మేనేజ్ చేయలేరు!
“అధికార దుర్వినియోగంతో వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు కానీ, ప్రజల ఆగ్రహాన్ని మేనేజ్ చేయలేరు” అని కిషన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ సమాజం ఈ అన్యాయాన్ని గమనిస్తోందని, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న వారికి ప్రజాక్షేత్రంలో తగిన శాస్తి తప్పదని ఆయన స్పష్టం చేశారు.






