Harish Rao Pressmeet | తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కు సోమవారం రాత్రి సిట్ (SIT) నోటీసు జారీ చేసింది.
మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావాలని సిట్ అధికారులు ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు కోకాపేటలో కేటీఆర్, పార్టీ నేతలతో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని, సీఎం ఆడుతున్న సిల్లీ డ్రామాగా అభివర్ణించారు. సోమవారం రాత్రి నోటీసులు ఇచ్చి, మంగళవారం ఉదయం విచారణకు రావాలని చెప్పడం అన్యాయమన్నారు.
చట్టంపై గౌరవం ఉందని, అందుకే విచారణకు హాజరవుతున్నానని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతిని ప్రశ్నించినందుకే నోటీసులిచ్చారని ఆరోపించారు.
ప్రజల దృష్టిని బొగ్గు కుంభకోణం, ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించేందుకే ఈ చర్యలని హరీశ్ రావు విమర్శించారు. గతంలో తనపై పెట్టిన కేసులను న్యాయస్థానాలు కొట్టేశాయని గుర్తు చేశారు. ఎన్ని సార్లు పిలిచినా విచారణకు వస్తామని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.









