Village Bans Ice Cream | వేసవి కాలం వచ్చిందంటే చాలు.. గల్లీ గల్లీలో ఐస్ క్రీమ్ బండ్లు సందడి చేస్తాయి. అయితే, ఆ రంగు రంగుల ఐస్ క్రీమ్ వెనుక దాగి ఉన్న రసాయనాల ముప్పును పసిగట్టిన ఒక గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది.
“మా ఊరిలోకి ఐస్ క్రీమ్ బండ్లు రావొద్దు” అంటూ ఏకంగా ఊరి పొలిమేరలోనే బోర్డు పెట్టేశారు చింతూరు మండలం గూడూరు గ్రామస్థులు.
ఆరోగ్యమే మహాభాగ్యం: రూ. 5,000 జరిమానా!
అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు ఐస్ క్రీమ్ లలో ప్రమాదకరమైన రసాయనాలు, కల్తీ పదార్థాలు కలుపుతున్నారనే ఆందోళన గ్రామస్థుల్లో నెలకొంది. తమ పిల్లల ఆరోగ్యం పాడవకూడదనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేశారు.
గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఊరి ప్రధాన రహదారి వద్ద “గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్లు రావొద్దు” అని స్పష్టంగా రాసి ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించి గ్రామంలోకి వస్తే, వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
చైతన్యానికి మారుపేరుగా ‘గూడూరు’
గూడూరు గ్రామస్థులకు ఇలాంటి సామాజిక నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గ్రామంలో అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపులను సైతం అందరూ ఏకమై మూసివేయించారు.
ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం ఐస్ క్రీమ్ లను దూరం పెట్టి మరోసారి తమ ఐక్యతను, సామాజిక స్పృహను చాటుకున్నారు.
ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా గూడూరు గ్రామస్థుల బాటలో నడవాలని ఆలోచిస్తున్నారు.







