“ఈ ప్రపంచానికి నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. సత్యం అహింస అనేవి ఈ భూమి మీద పర్వతాల మాదిరిగానే అతి పురాతన మైనవే” – మహాత్మా గాంధీ
నిజమే మహాత్ముడు ఈ ప్రపంచానికి కొత్తగా ఏం నేర్పలేదు. ఈ భూమి మీద ఉన్న జంతువుల్లో విచక్షణ ఉన్న ఏకైక జీవి అయిన మనిషికి ఉండాల్సిన గుణాలు, అనుసరించాల్సిన మార్గాలను మానవుడికి గుర్తు చేశారు. స్వయంగా ఆయనే అనుసరించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు.
యుద్ధాలు చేసి.. రక్తం ఏరులై పారించి రాజ్యాలను గెలిచే సంస్కృతికి చరమగీతం పాడారు బాపూజీ. సత్యం, అహింస అనే కంటికి కనిపించని ఆయుధాలతో శత్రువును గెలిచారు. భారతీయులను బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి చేయడమే కాదు.. శత్రువుకు కూడా పాఠాలు నేర్పించారు.
మహాత్ముడి జీవితం ఓ తెరిచిన పుస్తకం. ఆయన రాసుకున్న ఆత్మకథే దీనికి ఓ నిదర్శనం. తన జీవితంలో ఎదురైన అన్ని సంఘటనలను.. ఆయన చేసిన తప్పొప్పులను సైతం.. నిర్మొహమాటంగా.. నిష్పక్షపాతంగా ఎలాంటి దాపరికాలు లేకుండా ప్రపంచం ముందు ఉంచారు.
గాంధీ ఆలోచనలను ఆచరించే వారికి, ఆయన సిద్ధాంతాలను అనుసరించే వారికి మహాత్ముడికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. బాపూ 151 వ జయంతి సందర్బంగా ఆయన గురించి నేటి తరానికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..
గాంధీజీ ఒకసారి రైలు ఎక్కే సమయంలో ఆయన షూ జారి రైల్వే ట్రాక్ పడిపోయింది. దాన్ని తీసుకునే అవకాశం లేకపోవడంతో వెంటనే తన రెండో షూ కూడా మొదటిది పడిపోయిన దగ్గరకి విసిరేశారట. ఎందుకో ఊహించారా? షూ తనకు ఎలాగూ ఉపయోగపడదు. రెండూ ఒకే చోట ఉంటే.. కనీసం అవి దొరికినవారికైనా ఉపయోగపడతాయి కదా అనేది మహాత్ముడి ఉద్దేశం. చిన్న చిన్న విషయాలపట్ల కూడా మహాత్ముడు ఎలా ఆలోచిస్తారో నిదర్శనం ఈ సంఘటన..

అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ టైమ్స్ మ్యాగజీన్ ఏటా ప్రచురించే ‘మ్యాన్ ఆఫ్ ది ఈయర్’ లేదా ‘పర్సన్ ఆఫ్ ది ఈయర్’ ప్రపంచంలోనే ఎంత ప్రతిష్టాత్మకమైందో తెలిసిందే కదా. అయితే.. 1923లో ప్రారంభమైన ఈ మ్యాగజీన్ పర్సన్ ఆఫ్ ది ఈయర్ చరిత్రలో చోటు సాధించిన ఏకైక భారతీయుడు మహాత్మ గాంధీ మాత్రమే. 1930లో బాపూ చేపట్టిన దండి సత్యాగ్రహ ఉద్యమానికి గానూ ‘మ్యాన్ ఆఫ్ ది ఈయర్’ గా నిలిచారు.
బాపూ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు 1906లో ఆ దేశంలో బ్రిటిష్ పాలనలకు వ్యతిరేకంగా జులూ తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటులో బ్రిటిష్ సైనికులు గాయపడ్డారు. దీంతో ఆ సైనికులకు వైద్య సహాయం అందించడానికి గాంధీ 21 మంది భారతీయులను స్ట్రెచర్ బేరర్‌లుగా నియమించారట.

మహాత్ముడు స్వయంగా రాసుకున్న తన జీవిత కథ సత్యశోధన లేదా ఆత్మకథ పుస్తకం గురించి తెలుసు కదా. ఈ పుస్తకం 1927లో ప్రచురితమైంది. అయితే 1999లో హార్పర్ కొల్లిన్స్ పబ్లిషర్స్ అనే సంస్థ ప్రకటించిన 20 శతాబ్దపు 100 అంత్యత ప్రభావంతమైన ఆధ్యాత్మిక గ్రంథాల జాబితాలో బాపూ ఆత్మకథకు కూడా స్థానం కల్పించింది.

ప్రపంచంలో ఏటా ప్రకటించే అత్యంత విలువైన అవార్డు నోబెల్ ప్రైజెస్. ఏటా వివిధ రంగాల్లో విశేష సేవలందిచిన వారికి ప్రకటిస్తారు. అయితే 1948లో మహాత్ముడు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్లు ముగియక ముందే బాపూ హత్యకు గురయ్యారు. దీంతో ఆ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించకూడదని నిర్ణయించింది. కారణమేంటో తెలుసా.. అవార్డు స్వీకరించే అర్హత కలిగిన సజీవంగా ఉన్న వ్యక్తులు ఎవరూ లేరని.

టైమ్స్ మ్యాగజీన్ 1999లో 20వ శతాబ్దపు పర్సన్ ఆఫ్ ది ఈయర్ కోసం 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో మహాత్ముడు రెండో స్థానంలో నిలిచారు. అప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తుండటంతో ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ను పర్సన్ ఆఫ్ ది సెంచరీగా ఎంపిక చేసింది.


గాంధీజీ ఇంగ్లిష్ ఏ స్లాంగ్‌లో మాట్లాడేవారో తెలుసా? ఐరిష్ స్లాంగ్. కారణం ఆయనకు మొదట ఇంగ్లిష్ నేర్పిన టీచర్ ఐరిష్ వ్యక్తి.
గాంధీ తన ఆత్మకథను గుజరాతీలో రాశారు. దాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడైన మహదేవ్ దేశాయ్ ఇంగ్లిష్‌లోకి అనువదించారు.
గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఎవరిచ్చారు అనే దానిపై ఇప్పటికీ కొంత సందిగ్ఢత ఉంది. చాలామంది రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారని చెబుతుంటారు. దీనికి కారణం.. ఒక రోజు బాపూ శాంతినికేతన్‌కు వెళ్లిన సందర్భంలో ఠాగూర్‌ని నమస్తే గురుదేవ్ అని పలకరించారట. వెంటనే స్పందిచిన ఠాగూర్ నేను గురుదేవ్ అయితే.. మీరు మహాత్ములు అని సంబోధించారట. అదే ఆ తర్వాత గాంధీ పేరు ముందు చేరింది.

భారతీయుల ఆర్థిక, సామాజిక దుస్థితి కారణంగానే గాంధీజీ పూర్తి దుస్తులు వేసుకోవడం మానేశారని మనందరికీ తెలుసు. కానీ ఎక్కడ, ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలుసా? 1921లో బాపూ మధురైలో పర్యటిస్తున్నప్పుడు చాలా మంది కేవలం ఒక ధోవతితోనే కనిపించారట. దీంతో అప్పటి నుంచి అదే ఆయన వేషధారణ అయింది.

మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించిన విషయం విదితమే! కానీ, ఆ సమయంలో బాపూ ఏం చేస్తున్నారో తెలుసా? దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే.. ఇండియా పాకిస్తాన్ దేశ విభజన సందర్భంగా జరిగిన విధ్వసం.. అల్లర్లకు నిరసనగా బాపూ నిరాహార దీక్షకు పూనుకున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన ఆనందం ఆయన జరుపుకోనేలేదు.

ప్రపంచంలో ఎందరో నాయకులను, దేశాలను ప్రభావితం చేసిన బాపూ రెండు విషయాల పట్ల మాత్రం అసంతృప్తిగా ఉండేవారట. అందులో ఒకటి తన చేతిరాత. ఆయన హ్యాండ్ రైటింగ్ ఏం బాగుండదని మహాత్ముడి భావన. రెండోది బాడీ మసాజ్. ఆయన బాడీ మసాజ్‌ను చాలా ఆస్వాదించేవారట.

మహాత్ముడిని దేశమంతా జాతిపిత అని సంబోధిస్తుంది కదా! వాస్తవానికి భారత ప్రభుత్వం ఆయనకు ఎప్పుడు అధికారింగా ఆ బిరుదును ప్రకటించలేదు. కానీ తొలిసారి 1944లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ రేడియోలో బాపూని జాతిపిత అని సంబోధించారు. అనంతరం సరోజినీ నాయుడు కూడా 1947లో ఓ కాన్ఫరెన్స్‌లో గాంధీకి జాతిపిత అని సూచించారు.

గూగుల్‌లో గాంధీ అనే పేరు టైప్ చేయగానే కొన్ని వందల సంఖ్యలో మహాత్ముడి ఫోటోలు దర్శనమిస్తాయి కదా! అయితే అసలు బాపూకి ఫొటోలు తీసుకోవడం అస్సలు నచ్చదట. కానీ, ఆ సమయంలో ఎక్కువ ఫొటోల్లో కనిపించిన వ్యక్తి ఆయనే.
దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి మహాత్ముడు అనుసరించిన మార్గం ప్రపంచం మొత్తాన్ని ప్రభావం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పోరాటం ఎంతలా ప్రభావం చేసిందంటే.. 12 దేశాల్లో పౌర హక్కుల ఉద్యమాలకు గాంధీయే బాధ్యుడు.
ఆఖరికి మహాత్ముడి హత్యానంతరం నిర్వహించిన అంతిమయాత్ర కూడా అప్పట్లో ఓ రికార్డు సృష్టించింది. కొన్ని వేలమంది దేశ ప్రజలు బాపూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దీంతో అది ఏకంగా 8 కిలోమీటర్లు సాగింది. మరో విషయం ఏంటంటే.. 1948లో మహాత్ముడి అంతిమయాత్రకు ఉపయోగించిన బండినే 1997లో మదర్ థెరిసా అంతిమ యాత్రకు కూడా ఉపయోగించారు.

గాంధీజీ జాతికి అందించిన సేవలను దేశం మొత్తం గుర్తుంచుకుంటుంది. ఆయన స్మృతికి చిహ్నంగా దేశవ్యాప్తంగా దాదాపు 53 ప్రధాన రహదారులకు గాంధీ పేరునే పెట్టారు. ఇవే కాకుండా చిన్న చిన్న రోడ్లు అదనం. మనదేశానికి బయట కూడా వివిధ దేశాల్లో బాపూ పేరుతో మరో 48 రోడ్లు ఉన్నాయట.
డిజిటల్ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఆపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ గురించి తెలుసు కదా. ఆయన మహాత్ముడికి వీరాభిమాని. స్టీవ్.. మహాత్ముడికి గుర్తుగానే గుండ్రని కళ్లజోడు ధరించేవాడు.
