Eatala Rajendar News | భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే.
మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరి ఆమోధయోగ్యంతో రామచందర్ రావు ఎన్నికయ్యారని ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ రామచంద్ర రావు గారు నాకంటే చాలా పెద్దవారు కానీ.. నాకు ఆయనకు చాలా రోజుల నుంచి మంచి స్నేహితం ఉంది. మా అన్నతో పాటు వెళ్ళినప్పుడల్లా ఆయనని కలిసేవాన్ని. చదువుకునేటప్పుడు కూడా విద్యార్థి సంఘాల్లో పని చేశాము. 35 ఏళ్లుగా ఆయన్ను దగ్గర నుంచి చూసాము. వారు సౌమ్యుడు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్త. అనేక విషయాలపట్ల సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు. శాసనమండలిలో మేము మంత్రులుగా ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఒక్కరే ఎమ్మెల్సీగా ఉన్నా.. ఆయన నిర్వహించిన పాత్ర ఎంత గొప్పగా ఉందో అని అనేకసార్లు ప్రశంసించాము. కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో తప్పకుండా ముందు భాగంలో ఉంటారని.. మేమందరము సంపూర్ణ సహకారము అందిస్తామని.. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’ అని ఈటల పేర్కొన్నారు.