BRS vs Seethakka legal notice | తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేసిన స్మార్ట్ ఫోన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. మంత్రి సీతక్క పంపిన లీగల్ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది.
ఆరోపణలకు సమాధానం చెప్పకుండా, ఏ సంబంధం లేని తమ అధినేత కేసీఆర్కు నోటీసులు పంపడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో పారదర్శకత లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
35,310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలు కోసం రూ. 54 కోట్లకు టెండర్లు పిలిచి, వాస్తవానికి ఖర్చు చేసింది కేవలం రూ. 24 కోట్లు మాత్రమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మిగిలిన రూ. 30 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని వారు నిలదీస్తున్నారు.
ఈ కాంట్రాక్టును ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రమేయంతో వేరే వారికి ఇప్పించారని, ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణపై నమ్మకం లేదని, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఇందులో ఉన్నందున తక్షణమే CBI విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
“మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, చెప్పుతో కొడతాం అనడం మంత్రి సంస్కారమా?” అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
తమ నాయకుడు కేసీఆర్ నేర్పిన సంస్కారం తమకు ఉందని, సీతక్క చెప్పుతో కొట్టినా భరిస్తాం కానీ.. ప్రజలకు వాస్తవాలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.
లీగల్ నోటీసుపై అభ్యంతరం..
తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన విచారణ కోరవచ్చు కానీ, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నోటీసులు పంపడం వెనుక రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేమీ లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఈ ‘స్మార్ట్ కుంభకోణం’పై తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, విచారణకు హాజరయ్యేందుకు భయపడేది లేదని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశాయి.






