Bihar Election Results | సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్ లో లాలూ ఉంటాడు. ఇది బీహార్ రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క పట్టును తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు బీహార్ పై లాలూ పట్టు కోల్పోయాడు. అలాగే లాలూ పాలన ఇప్పుడు అతడి తనయుడు తేజస్వి యాదవ్ ను వెంటాడుతుంది.
‘జంగల్ రాజ్’ అనే భూతం లాలూ కుటుంబాన్ని వెంటాడుతుంది. ఈ భూతం మరోసారి ఆర్జేడీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంది. ఇదే ప్రధాన ఆయుధంగా వాడిన ఎన్డీయే కూటమి తిరిగి బీహార్ లో పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. జంగల్ రాజ్ అనే పదాన్ని 1997లో పట్నా హైకోర్టు తొలిసారి వినియోగించింది. లాలూ హయాంలో ఆ రాష్ట్రంలో నెలకొన్న ఆటవిక పరిస్థితులను వర్ణిస్తూ ఈ పదం వినిమయంలోకి వచ్చింది.
మార్చి 10 1990. ఈరోజు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి నుండి 2005 వరకు లాలూ కనుసన్నల్లో బీహార్ నడిచింది. ఈ సమయంలో లాలూ కుటుంబం అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఉపాధి కల్పించి ఆదాయాన్ని పెంచే పరిశ్రమల కన్నా కిడ్నాప్, హత్యా, దోపిడీ పరిశ్రమలు బీహార్ లో పెట్రేగిపోయాయనేది వాస్తవం. రాష్ట్ర రాజధాని నుంచి లాలూ సర్కారు ను నడిపిస్తుంటే వివిధ ప్రాంతాల్లో చోటా సర్కార్ గా పేరుగాంచిన బాహుబలులు చెలరేగిపోయారు.
రాత్రి అయితే బయటకు వెళ్లలేని దుర్భర స్థితి లాలూ కాలంలో ఉండేదనేది చాలా మంది చెబుతుంటారు. ఇకపోతే లాలూ కుటుంబంపై అనేక తీవ్రమైన ఆరోపణలు. అవినీతి అనేది అంతటా ఉండేది. కానీ హత్య, అత్యాచారాల వంటి అతి తీవ్రమైన ఆరోపణలు లాలూ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఎమ్మెల్యేలు మరియు నిత్యం లాలూ వెంటే ఉండే వారిపై వచ్చాయి. అయినప్పటికీ లాలూ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇకపోతే ఆర్జేడీ నేతలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను గుప్పుట్లో పెట్టుకుని వసూళ్లు చేసేవారు. లాలూ కాలంలో బీహార్ సమాజం నిట్టనిలువునా చీలింది. ఇలా లాలూ కాలంలో బీహార్ ప్రజలు భయంతో రోజులు గడిపేవారని ప్రత్యర్ధులు నిత్యం చేసే వ్యాఖ్యలే. ఇలా లాలూ గత పాలన ఇప్పుడు ఆయన తనయుడు తేజస్వి యాదవ్ ను వెంటాడుతుంది. ఆ జంగల్ రాజ్ మచ్చ నుంచి లాలూ తనయుడు బయటపడి ఎన్నికల్లో గెలిచేందుకు మరెన్ని ఎన్నికలు అవసరమో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.









