Bandi Sanjay News | రెండు తెలుగురాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతుండడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తుంది. సోమవారం చేవెళ్లలో జరిగిన ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదంలో ఏకంగా 24 మంది మృతి చెందారు. అది మరవకముందే మంగళవారం తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద బస్సు-ట్రాక్టర్ ఢీ కొని ప్రమాదం జరిగింది.
ఇందులో 15 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. వరుస బస్సు ప్రమాదాలు తనను కలవరపరుస్తున్నాయన్నారు. రేణుకుంట బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పత్తితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో, పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని.. అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు.
ఈ విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మెట్పల్లి డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది గాయపడగా, వీరందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.









