Family Card In AP | ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫెట్ కార్డు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
గురువారం ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ కార్డు మాదిరిగానే ఉండే ఈ ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన మొత్త సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సహా పూర్తి వివరాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని.. అందులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అవసరమైతే.. వాటిని వెంటనే వారికి అందేలా ఒక వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం.. కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని చంద్రబాబు పేర్కొన్నారు.









