Akhilesh Yadav Criticises Ayodhya Deepotsav | ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు మాజీ సీఎం, సమజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. దీపావళి పండుగ సందర్భంగా సరయు నదీ ఒడ్డున అయోధ్య రామాలయంలో 26 లక్షల దీపాలను వెలిగించారు.
ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే సోమవారం దీపోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే స్థానికులు దీపాలలో మిగిలిపోయిన నూనెను బాటిళ్లలో నింపుకుని తీసుకెళ్లారు. గతంలో కూడా ఇలానే జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ స్పందించారు.
‘అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో లక్షల దీపాలు వెలిగించిన దృశ్యాలు తాత్కాలికం, వాస్తవం అయిన దృశ్యాలు ఇవి. భారీ వెలుతురు తర్వాత ఈ అంధకారం మంచి కాదు’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. అంటే ప్రజల దుర్భర స్థితిని మార్చాలి అంతేకాని రూ.కోట్లు ఖర్చు చేసి అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించడం కాదని ఆయన పరోక్షంగా అన్నారు.









