Karnataka DGP mandates birthday and anniversary leave for police personnel | పోలీసు అధికారులకు శుభవార్త అందించారు కర్ణాటక డీజీపీ ఎంఏ సలీం. పుట్టినరోజు, పెళ్లి రోజున పోలీసు అధికారులకు కచ్చితంగా సెలవు మంజూరు చేసే విధంగా ఒక సర్క్యులర్ ను జారీ చేశారు. ఈ ప్రత్యేక రోజుల్లో పోలీసులు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారని, డ్యూటీ మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకుంటారని పేర్కొన్నారు. కఠినమైన పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ను కాపాడుతూ ప్రజా భద్రత కోసం పనిచేస్తున్న పోలీసుకు పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక రోజులు ముఖ్యమైనవని పేర్కొన్నారు.
ఈ రోజుల్లో సెలవు మంజూరు చేయడం ద్వారా కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడంతో పోలీసుల ఉద్యోగ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మనోధైర్యాన్ని పెంచుతుందన్నారు. అలాగే ఈ ప్రత్యేక రోజుల్లో సెలవులు మంజూరు చేయడం ద్వారా వారి త్యాగాలను గుర్తించినట్లు అవుతుందన్నారు. అలాగే విధేయత, నిబద్ధత, క్రమశిక్షణ పెరగడానికి దోహద పడుతుందని నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు పుట్టినరోజున మరియు వివాహ వార్షికోత్సవాల సందర్భంగా సెలవు కోరిన అధికారులకు, సిబ్బందికి కచ్చితంగా లీవ్ మంజూరు చేయాలని ఇవ్వకుండా ఉండకూడదని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.









