SC Notice To TG Speaker | తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ న్యాయస్థాన ఆదేశాలను ఉల్లంఘించారని, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్‌లో ఆరోపించారు.
ఇదే అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో పాటు మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.









