Telangana Highcourt | హైదరాబాద్‌కు చెందిన ఓ భర్త, తన భార్య వంట చేయడం లేదనీ, దాన్ని మానసిక క్రూరత్వంగా పేర్కొంటూ విడాకుల కోసం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ను ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను హైకోర్టు స్పష్టంగా తిరస్కరించింది.
దాంపత్య జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న అసహనాలు, రోజువారీ ఒత్తిళ్లు విడాకులకు చట్టబద్ధమైన కారణాలు కావని కోర్టు తేల్చి చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్, భార్య వంట చేయకపోవడం లేదా ఇంటి పనులను సరిగా సమన్వయం చేయలేకపోవడం, ప్రత్యేకించి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు క్రూరత్వంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది.
అలాంటి పరిస్థితుల్లో భార్య ఆహారం సిద్ధం చేయకపోవడాన్ని “తీవ్రంగా చూడాల్సిన అంశం కాదు” అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అలాగే, భర్త తన ఆరోపణలను నిరూపించే సరైన ఆధారాలు సమర్పించలేకపోయాడని కోర్టు గమనించింది.
దిగువ కోర్టు తీర్పులో ఎలాంటి చట్టవిరుద్ధత లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా, వివాహ జీవితంలో సహజంగా వచ్చే చిన్నపాటి విభేదాలు విడాకులకు సరిపోవని, హిందూ వివాహ చట్టం ప్రకారం ‘క్రూరత్వం’ అనేది తీవ్రమైన హాని లేదా ప్రమాదాన్ని సూచించాల్సి ఉంటుందని హైకోర్టు మరోసారి గుర్తు చేసింది.









