USA Offers To Illegal Immigrants | అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కార్ ఓ ఆఫర్ ప్రకటించింది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ (Illegal Immigrants) స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వనుంది.
ఈ ఏడాది చివరిలోగా దేశం విడిచి వెళ్లేవారికి 3,000 డాలర్ల నగదుతో పాటు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 22న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ పథకంలో చేరేవారికి దేశం విడిచి వెళ్లనందుకు విధించిన సివిల్ జరిమానాలను కూడా రద్దు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అందుకోసం వలసదారులు ‘CBP హోమ్’ అనే మొబైల్ యాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సమాచారం నింపితే చాలు, మిగతా ప్రయాణ ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని అని DHS తన ప్రకటనలో పేర్కొంది. పండుగ సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్‌ను వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, మేము వారిని గుర్తించి, అరెస్ట్ చేసి, దేశం నుంచి బహిష్కరిస్తామని, వారు మళ్లీ అమెరికాలోకి ఎప్పటికీ అడుగుపెట్టలేరు” అని తేల్చిచెప్పింది.









