Rahul Gandhi visits BMW Plant in Germany | లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం జర్మనీ దేశంలో పర్యటిస్తున్నారు. జర్మన్ రాజధాని బెర్లిన్ వేదికగా జరుగుతున్న ‘ఇండియన్ ఓవరసీస్ కాంగ్రెస్’ సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మ్యూనిక్ లోని బీఎండబ్ల్యూ హెడ్ క్వాటర్స్ ను సందర్శించారు. బీఎండబ్ల్యూ వెల్ట్, బీఎండబ్ల్యూ ప్లాంట్ సందర్శనలో భాగంగా అక్కడ తయారు చేస్తున్న నూతన కార్లు, బైకులను పరిశీలించారు.
ఎం సిరీస్, ఎలక్ట్రిక్ బైకులు, రోల్స్ రాయిస్, మ్యాక్సీ స్కూటర్స్ తదితర వాహనాలను తిలకించారు. టీవీస్-బీఎండబ్ల్యూ భాగస్వామ్యంలో తయారవుతున్న 450సీసీ బైకును రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పరిశీలించారు. బీఎండబ్ల్యూ ప్లాంట్ లో ఇండియన్ ఇంజనీరింగ్ గర్వంగా ఉందన్నారు. అనంతరం మాట్లాడుతూ..బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలకు తయారీ రంగం వెన్నెముక లాంటిదని రాహుల్ పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు, భారతదేశంలో తయారీ రంగం క్షీణిస్తోందని దేశ వృద్ధిని వేగవంతం చేయాలంటే, మరింత ఉత్పత్తి చేయాలి—అర్థవంతమైన తయారీ వ్యవస్థలను నిర్మించాలన్నారు.









