Scrub Typhus surge in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని, ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. తమిళనాడు, ఒడిస్సాలలో 7 వేలు చొప్పున కేసులు ఉన్నాయని వివరించారు.
ఈ క్రమంలో స్క్రబ్ టైఫస్‌ను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు. అలాగే స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇకపోతే ఈ వ్యాధి రికెట్టియా అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుందని, ఈ బ్యాక్టీరియా కలిగిన పేడ పురుగు కుట్టినవారు స్క్రబ్ టైఫస్ బారిన పడతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కుట్టినచోట నల్లటి మచ్చ వస్తుందని చెబుతున్నారు. ఇంకా తీవ్రమైన జ్వరం, శరీరం మీద దద్దుర్లు, కండ్లకలక, దగ్గు, ఒంటినొప్పులు, ఊపిరి తీసుకోవడం కష్టంగా వుండడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు వరుసగా రెండు రోజులపాటు తీవ్రమైన జ్వరం వుంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.









