Telangana invites CM Chandrababu to Global Summit | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ జరగనున్న విషయం తెల్సిందే. ఈ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో రాజకీయ, సినీ, పారిశ్రామిక మరియు క్రీడా ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపుతుంది.
ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును కలిసి మంత్రి కోమటిరెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందజేశారు. దావోస్ నమూనాలో జరిగే ఈ సమ్మిట్‌లో ప్రపంచ, జాతీయ పరిశ్రమల నేతలు, నిపుణులు పాల్గొననున్నారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను $3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ ను ఈ వేదికపై ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తుందని చంద్రబాబుకు కోమటిరెడ్డి వివరించారు.









