Sanath Jayasuriya Thanks To Pm Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు శ్రీలంక లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్య. దిత్వా తుఫాన్ కారణంగా శ్రీలంక దేశం అతలాకుతలం అయింది. భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 400 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఆపద సమయంలో శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ దేశంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అనేక మంది శ్రీలంక ప్రజలను ఈ బృందాలు రక్షించాయి. అలాగే 53 టన్నుల అత్యవసర వస్తువులను ప్రత్యేక విమానాల్లో భారత్ పంపింది. ఈ భారీ ఆపరేషన్ కు ‘ఆపరేషన్ సాగర్ బంధు’ అని నామకరణం చేసింది ప్రభుత్వం. కాగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న భారత బృందాలకు అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇలాంటి ఓ ఫోటోపై జయసూర్య స్పందించారు.
అత్యంత కీలక సమయంలో శ్రీలంకకు అండగా ఉన్నందుకు భారత్ కు ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు అలాగే భారత ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఆర్ధిక సంక్షోభం నెలకొన్న సమయంలోనూ, ఇప్పుడు విపత్తు సమయంలోనూ శ్రీలంకకు అండగా భారత్ నిలిచిందని ఇది ఇరు దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలను తెలియజేస్తుందని ఈ స్టార్ క్రికెటర్ పేర్కొన్నారు.









