SC judge’s cricketing analogy and Gambhir reference leaves courtroom laughing | దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా టీం ఇండియా టెస్టు పర్ఫార్మెన్స్ పై, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై చర్చ జరగడం ఆసక్తిగా మారింది. గంభీర్ దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శిష్యుడని, ఆయన మూలంగానే గంభీర్ పార్లమెంటు సభ్యుడు అయ్యారని ప్రముఖ న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో టీం ఇండియా వైట్ వాష్ అయిన విషయం తెల్సిందే. 12 నెలల సమయంలో స్వదేశంలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల చేతిలో వైట్ వాష్ అయిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా టెస్టుల్లో టీం ఇండియా ఆటతీరుపై చర్చ మొదలైంది. కేసు విచారణలో భాగంగా టీం ఇండియా టెస్టు ప్రదర్శనను న్యాయమూర్తి ఉదహరించారు.
టీ-20, వన్డే ఫార్మాట్ లపై అధిక దృష్టి పెడితే టెస్టుల్లో ఓటమి తప్పదు అంటూ న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ పేర్కొన్నారు. దింతో వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి స్పందించారు. ‘టీం ఇండియా హెడ్ కోచ్ నాకు మిత్రుడు అలాగే నా క్లయింట్. ఈరోజు ఉదయమే నేను అతనికి ఫోన్ చేశా. సొంతగడ్డపై, సొంత పిచెస్ పై ఇలా ఓడిపోతుంటే కోచింగ్ ఆపేయడమే మంచిది అని దేశం మొత్తం అంటుంది అని అతనితో చెప్పాను. అరుణ్ జైట్లీ శిష్యుడు గంభీర్. జైట్లీ లేకుంటే గంభీర్ ఎంపీ అయ్యే వారు కాదు’ అని రోహత్గి కోర్టులో వ్యాఖ్యానించారు. ఈ సంభాషణ ఎప్పుడు జరిగింది, ఏ కేసు విచారణ సందర్భంగా జరిగింది అనేది తెలియాలి.









