2 Acres For Rs 10000 | ఇటీవల కాలంలో స్థిరాస్తుల విక్రయాల్లో కొత్త ధోరణి ప్రారంభమైంది. కొంతమంది తమ స్థిరాస్తులు అంటే ప్లాట్లు, భూములను అమ్ముకునేందుకు లక్కీ డ్రా విధానాన్ని అవలంబిస్తున్నారు.
తక్కువ మొత్తం పెట్టుబడితో పెద్ద ఆస్తి పొందే అవకాశం ఉండటంతో ప్రజలు కూడా ఈ విధానంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కొద్దిరోజుల కిందట యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఓ వ్యక్తి తన 65 గజాల ఇంటిని ఇలాగే లక్కీ డ్రా రూపంలో విక్రయించాడు.
తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు కూడా తన భూమిని అమ్మడానికి ఇదే లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకున్నారు. రాజంపేట మండలంలోని బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.
ఆయన తన 2 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని విక్రయించేందుకు ఈ లక్కీ డ్రా విధానాన్ని ఎంచుకున్నారు. ఒక్కో టికెట్‌ను రూ. 10,000 చొప్పున మొత్తం 500 టికెట్లు విక్రయించనున్నట్లు ప్రకటన చేశారు.
కేవలం రూ. పది వేలు చెల్లించి.. దాదాపు 50 లక్షల విలువైన భూమిని పొందే అద్భుతమైన అవకాశం కావడంతో.. సోషల్ మీడియాలో ప్రజల నుంచి దీనిపై ఆసక్తి పెరుగుతోంది. 2026 సంక్రాంతి లోపు సభ్యుల నమోదు పూర్తి చేసి డ్రా నిర్వహిస్తానని ప్రకటించారు.









