Putin Reveals Russia’s Love for Indian Cinema | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయ సినిమాలపై తన ప్రేమను మరోసారి వ్యక్తపరచారు. బ్లాక్ సీ రిసార్ట్ నగరం సోచిలో జరిగిన వాల్డై డిస్కషన్ గ్రూప్ సమావేశంలో మాట్లాడుతూ, రష్యా ప్రజలకు ఇండియన్ సినిమా అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రష్యాలో భారతీయ సినిమాల కోసం ప్రత్యేక టీవీ ఛానల్ ఉందని, అది 24 గంటల పాటు భారతీయ సినిమాలను ప్రసారం చేస్తుందని ఆయన తెలిపారు. భారత్-రష్యా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా వర్ణించిన పుతిన్ సోవియట్ యుగం నుంచి భారత స్వాతంత్ర్య పోరాటానికి రష్యా సహాయం చేసిన విషయాన్ని భారతీయులు గుర్తుంచుకుంటున్నారని తెలిపారు.
భారత్-రష్యా సంబంధాలు రాజకీయ, దౌత్య బంధాలతో పాటు సాంస్కృతిక, మానవతా స్థాయిలలో కూడా బలంగా ఉన్నాయని పుతిన్ అన్నారు. కాగా ఇండియన్ సినిమాలు రష్యాలో సోవియేట్ కాలం నుంచి అత్యంత ప్రాచుర్యం పొందాయి. 1951లో విడుదలైన రాజ్ కపూర్ “అవారా” సినిమాకు రష్యాలో 100 మిలియన్ టికెట్లకు పైగా అమ్మడయ్యాయి. అలాగే 1982లో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన “డిస్కో డాన్సర్” కూడా అదే స్థాయిలో విజయం సాధించింది.









